స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో అన్యాయం
కాళ్లరిగేలా తిరుగుతున్న బాధిత కుటుంబాలు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: విధి నిర్వాహణలో మృతిచెందిన స్టీల్‌ప్లాంట్ కార్మికుల కుటుంబాలకు సకాలంలో ‘వర్క్‌మెన్ కాంపన్సేషన్’ అందజేయడంలో కార్మిక శాఖ విఫలమవుతోంది. ఇంటి పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మృతుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం వీలైన త్వరలో కాంపన్సేషన్ అందించాల్సింది పోయి నెలల తరబడి కార్మిక శాఖ నిర్లక్ష్యం చేస్తోంది. తమకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం డిపాజిట్‌గా చెల్లించిన మొత్తాన్ని అందజేయాలంటూ మృతుల కుటుంబాలు కార్మిక శాఖ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో హైకోర్టు సుమోటోగా కేసును తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. విధి నిర్వహణలో కార్మికులు గాయపడినా.. మృతి చెందినా యాజమాన్యం 30రోజుల్లోగా ఎంప్లాయీస్ కాంపన్సేషన్ యాక్టు 1923 ప్రకారం లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు, న్యాయపరంగా హక్కులు పొందిన వారికి ప్రతిఫలం చెల్లించాలి. కానీ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం సొమ్ము డిపాజిట్ చేసేసినా లబ్ధిదారులకు ఆ సొమ్మును అందజేయడంలో కార్మిక శాఖ మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాలంటూ 10, 11కుటుంబాలకు ఏడాది నుంచీ నరకం చూపిస్తోంది.
కోర్టు సుమోటోగా పరిగణించాలి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పని చేస్తూ ఇటీవల 10, 11మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో వర్క్‌మెన్ కాంపన్సేషన్ కోసం మృతుల కుటుంబ సభ్యులు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాన్ని పరిహారం కోసం ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం కనీసం రూ.9లక్షలకు పైగా ఒక్కో వ్యక్తి కుటుంబానికీ పరిహారం అందజేయాలంటూ స్టీల్‌ప్లాంట్ గతంలోనే స్థానిక కార్మిక శాఖ అధికారులకు డిపాజిట్ మొత్తాన్ని పంపించేసింది. అయితే ఏడాదవుతున్నా ఆ కుంబాలకూ పరిహారం అందలేదు. అధికారుల్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెబుతున్నారు. బాధితుడి కుటుంబానికి యాజమాన్యం అందజేసిన డబ్బును సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో కార్మిక శాఖ అధికారులు చెప్పాలి. తామెప్పుడో వర్క్‌మెన్ కాంపన్సేషన్ కింద కార్మిక శాఖకు సొమ్ము చెల్లించేశామని ఆర్ఐఎన్ఎల్ అధికారులు ఆధారాలు చూపిస్తున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న వారికి అన్ని విధాలా ఆసరా కల్పించాల్సింది పోయి అధికారికంగా రావాల్సిన సొమ్మును ఎందుకు అందించలేకపోతున్నారోనని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కార్మిక శాఖ నిర్లక్ష్యాన్ని కోర్టు సుమోటోగా సీరియస్‌గా తీసుకోవాలని, ఏడాది దాటినా ఆయా కార్మికుల కుంబాలకు దక్కాల్సిన పరిహారం అందలేదని, సమాచార హక్కు చట్టం ప్రకారం కోర్టుకు నివేదిస్తామని విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్, ఫెర్రో స్క్రాప్ నిగమ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, విశాఖ బిల్డర్స్ అండ్ కనస్ట్రక్షన్స్, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు తెలిపారు.