` శిథిలాల కింద మరో 20 మంది?
` హిమాచల్ ప్రదేశ్లో అతి భారీ వర్షాలు
` విద్యుత్ సరఫరాలకు అంతరాయం
` స్కూళ్ల సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
` సహాయక చర్యల్లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
సిమ్లా : భారీ వర్షాల దెబ్బకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్తం అయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల విపత్కర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సిమ్లాలోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడి 9 మంది మృతిచెందారు.
సోమవారం ఉదయం సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆలయం కుప్పకూలి పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో 40 నుంచి 50 మంది భక్తులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కొండచరియల కింద 15 నుంచి 20 మంది చిక్కుకుని మరణించి ఉండొచ్చని సిమ్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
శ్రావణ మాసం కావడంతో సోమవారం ఉదయం నుంచే శివాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయం కూలిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తలమునకలై ఉంది. ఘటనాస్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు.
భారీ వర్షాలు.. పేకమేడలా కూలిన డిఫెన్స్ కాలేజీ
హిమాచల్లో 24 గంటల వ్యవధిలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో కురిసిన కుంభవృష్టికి ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. గడిచిన 24 గంటల్లో సిమ్లాలో 131.6 మి.మీల వర్షపాతం నమోదైంది. సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటీవల హిమాచల్లో ఈ సీజన్లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం వాటిల్లింది. వర్ష సంబంధిత ఘటనల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందాకినీ నది డేంజర్ మార్క్ ను దాటి ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి చమోలీ జిల్లా నందనగర్ ఏరియాలోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నందనగర్ ఏరియాలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. నందాకినీ నదితో పాటు రాష్ట్రంలోని పలు ఇతర నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు వెల్లడిరచారు.