వెస్టిండీస్ గడ్డపై టీమిండియాకి నిరాశ తప్పలేదు. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పుంజుకున్నట్లే కనిపించిన టీమ్ఇండియా భంగపడింది. విండీస్‌తో చివరి టీ20లో ఓడి సిరీస్‌ను 2-3తో కోల్పోయింది. గత మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన అదే వేదికలో భారత్ తగినంత స్కోరు చేయలేకపోగా.. బ్రెండన్ కింగ్, పూరన్ మెరుపులతో కరీబియన్ జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ అర్ధశతకం వృథా అయింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
లాస్ట్ టీ20లో బ్యాటింగ్‌లో దూకుడు కొరవడడంతో వెస్టిండీస్‌తో చివరిదైన అయిదో టీ20లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆదివారం మొదట భారత్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ (61; 45 బంతుల్లో 4×4, 3×6) టాప్ స్కోరర్. రొమారియో షెఫర్డ్ (4/31), అకీల్ హోసీన్ (2/24) భారత్‌ను కట్టడి చేశారు. బ్రెండన్ కింగ్ (85 నాటౌట్; 55 బంతుల్లో 5×4, 6×6), పూరన్ (47; 35 బంతుల్లో 1×4, 4×6) మెరవడంలో లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య సారథ్యంలో భారత్ టీ20 సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. అతడి నేతృత్వంలో భారత్ ఇంతకుముందు నాలుగు సిరీస్‌లు గెలుచుకుంది.