ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిల్లు చేసుకోవడం క్రమంగా పెరుగుతోంది. మరికొందరూ పెద్దలు చూసిన అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రేమించిన అమ్మాయి దక్కకుండా పోతుందని ప్రియుడు ఆమెతో కలిసి పారిపోయి వేరే చోట వివాహాలు చేసుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా తమిళనాడులోని ఓ విచిత్ర ఘటన చేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి కోసం పట్టుబట్టి.. అతడ్ని కిడ్నాప్ చేసి మరి ఓ యువతి తాళి కట్టించుకోవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ ప్రియుడికి మరో యువతితో వివాహం కూడా జరిగిపోయింది. అయినా కూడా ఆమె అతనే కావాలంటూ పట్టుబట్టి మరి ఇలా తాళి కట్టించుకోవడంతో ఒక్కసారిగా స్థానికులు ఆశ్చర్యపోయారు.
చైన్నైలోని వేలవచ్చేరి అనే ప్రాంతనికి చెందిన పార్థిబన్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతనికి తన కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడు సౌందర్య అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పార్థిబన్ సౌందర్యను ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. ఇందుకు ఆమె కూడా అంగీకరించింది. ఇక ఏముంది వీరిద్దరి ప్రేమ కథ అప్పుడే మొదలైపోయింది. సుమారు ఏడు సంవత్సరాల వరకు వీరి ప్రేమ కథ సాగింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. ఇక చివరికి వీరు విడిపోయారు. అయితే గత నెలలో పార్థిబన్కు ఐటీలో పనిచేస్తున్నటువంటి మరో యువతితో పెళ్లి జరిగింది. అతనికి వివాహం అయిన సంగతి సౌందర్యకు తెలిసింది.
పార్థిబన్ను మర్చిపోలేకపోతున్నానని.. అతడ్నే పెళ్లి చేసుకుంటానని.. తన తల్లి, బంధువులతో చెప్పింది. అయితే తన తల్లి, ఇతర బంధువులతో కలిసి పార్థిబన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు.
శుక్రవారం రోజున యాథావిధిగా ఆఫీస్కు వెళ్లిన పార్థిబన్ను కారులో కిడ్నాప్ చేశారు. అతనికి తన చుట్టూ అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోపే కాంచీపురంలోని ఆలయానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. అయితే ఈ విషయం పార్థిబన్ భార్యకు తెలిసింది. దీంతో తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగానే నిందితులను గుర్తించారు. పార్థిబన్ మాజీ ప్రియురాలైనటువంటి సౌందర్యను, అలాగే ఆమె బంధువులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.