అనకాపల్లి జిల్లా విసన్నపేట భూ దోపిడిపై జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. వారాహి యాత్రలో భాగంగా విసన్నపేట భూములను పరిశీలించారు. తెలంగాణలో ఇదే తరహాలో దోపిడి చేస్తే తన్ని తరిమేశారని అన్నారు. ఉత్తరాంధ్రను దోపిడి చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు మాట్లాడకుండా దోపిడికి వంత పాడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా యువతకు ఉపాధి లేదు. చదువుకున్నా ఉద్యోగాలు లేదు. ప్రధాన రహదారి నుంచి 20కిలోమీటర్లు లోపలికి ఈప్రాంతంలో యువత అర్తనాదాలు ఈపాలకులకు అర్థం కావడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు.. యువత వలసలు పోతోంది. రాష్ట్రం అప్పుల్లో వుంది. మరోవైపు వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నారన్నారు. అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలంలోని బయ్యారం రెవెన్యూ డివిజన్ లో విసన్నపేట గ్రామంలో 600 ఎకరాలకు పైగా వున్న పోరంబోకు భూములు, దళితుల భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలు వ్యాపారం జరుగుతోందన్నారు. సుమారు 13వేల కోట్లు రూపాయల వ్యాపారాన్ని చేసేందుకు రంగం సిద్దమైందన్నారు. పక్కనే రంగప్రోలు ప్రాజెక్ట్ కు 47 ఎకరాలకు అనుసంధానమై వుందన్నారు. అడ్డగోలుగా భూదోపిడి జరుగుతుంటే ఇక్కడ అధికార యంత్రాంగం ఏంచేస్తుంది అంటూ పవన్ ప్రశ్నించారు. వారాహి యాత్రలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.