ఎర్రమట్టి దిబ్బలు కాపాడుకుంటాం వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే.. గ్రీన్ ట్రైబ్యునల్ వరకు వెళ్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 16: భీమునిపట్నం మండలంలో ఎర్ర దిబ్బలు చారిత్రార్తకమైనవని, ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని బుధవారం సాయంత్రం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కేవలం 292 ఎకరాలే మిగిలాయన్నారు. ఎర్రమట్టి దిబ్బల రక్షణపై పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే, ఎర్రమట్టి దిబ్బల రక్షణ కోసం గ్రీన్ ట్రైబ్యునల్ వరకు వెళ్తామన్నారు. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎక్కడకక్కడ ప్రభుత్వ భూములను, కొండలను ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించనని హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్ బాబు, పంచకర్ల సందీప్ స్థానిక జనసేన నాయకులు, అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.