విజయవాడ, న్యూస్లీడర్, ఆగస్టు 16 : ఎమ్మెల్సీ అనంత్బాబు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో బుధవారం ఇరు వర్గాల వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ అనంత్బాబు తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, ప్రభుత్వం తరుపు న్యాయవాదికి హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. కేసులో ఎమ్మెల్సీ అనంత్బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని ప్రశ్నించింది. సీసీఫుటేజ్లో ఉన్న వారిని ఎందుకు కేసులో చేర్చలేదు..? కేవలం అనంత్ బాబును మాత్రమే చేర్చడం ఏమిటని ప్రశ్నించింది.
మరోవైపు.. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదంటూ పిటిషనర్ తరుపు న్యాయవాది జాడ శ్రావణ్ వాదనలు వినిపించారు.. కేసును పోలీసులు నీరు గార్చే విధంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఎమ్మెల్సీ అనంత్బాబు తరుపు సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. అయితే న్యాయస్థానం రఘు వాదనలు వినేందుకు అంగీకరించలేదు. ఇప్పటికే, ఈ కేసు వివరాలు సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి ప్రభుత్వం సమర్పించింది. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.