పుట్టిన ఏడాదిలోనే తండ్రి చనిపోయాడు.. మరో నాలుగేళ్లకు తల్లి కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది.. అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువతి తనను పెంచి పెద్ద చేసిన తాతకు ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వస్తుండగా, రైలు నుంచి జారిపడి రెండు కాళ్లూ కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి సమీపంలో చోటుచేసుకుంది.
గుడివాడ పట్టణంలోని కాకర్ల వీధిలో నివాసం ఉండే తోల జాహ్నవి సాయిశ్రీ(23) పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఆమె చిన్నతనంలోనే వివిధ కారణాలతో తల్లిదండ్రులు మృతి చెందగా అమ్మమ్మ, తాతయ్యలు పెంచి పెద్దచేశారు. ఉపాధి కోసం ఆమె పుట్టపర్తిలో నివాసం ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో తాతకు అనారోగ్యంగా ఉండటంతో పుట్టపర్తి నుంచి యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం గుడివాడ వచ్చారు. గుడివాడ స్టేషన్ వచ్చిందని ఆమె గుర్తించలేదు. రైలు గుడివాడ స్టేషన్ నుంచి బయలుదేరి మందపాడు వద్దకు రాగానే తోటి ప్రయాణికులు గుడివాడలో ఎందుకు దిగలేదని అడగ్గా వెంటనే బ్యాగ్‌తో సహా మందపాడు గేటు వద్ద దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె డోర్ వద్ద రాడ్డు పట్టుకొని జారిపోయి రైలు కిందకు పడిపోగా, ఆమె రెండు కాళ్లూ నుజ్జయిపోయాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.