తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొడుతున్న ఓ ముఠా రెండు రోజుల క్రితం రాజస్థాన్ పోలీసులకు చిక్కింది. అక్కడి పోలీసులు జైపుర్ విమానాశ్రయంలో కాపుకాసి ఈ ముఠాసభ్యులను పట్టుకున్నారు. వీరిని రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లా డీగ్ ప్రాంతానికి చెందిన జుబేర్, లుక్మాన్ డీన్, సద్దాం, ముస్తాక్, ఇద్రిస్గా గుర్తించారు.
ఈ ముఠా ఏడేళ్లుగా తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణలోని భద్రాద్రి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ‘మేవాఠ్ గ్యాంగ్’గా పిలిచే ఈ ముఠాలో 100 మంది వరకు మోసగాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
ముఠా సభ్యులు రాజస్థాన్‌లోని భరత్పూర్, అల్వార్ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఏటీఎం కార్డులు తీసుకుని పది రోజులకోసారి తాము ఎంచుకున్న రాష్ట్రాలకు విమానాల్లో ప్రయాణిస్తారు. పోలీసులకు అనుమానం రాకుండా సూటూబూటు ధరించి గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద మోసాలకు తెరలేపుతారు. ఇద్దరేసి చొప్పున జట్టుగా ఏర్పడి ఒకరు ఏటీఎం లోపల, మరొకరు ఏటీఎంకు విద్యుత్తు సరఫరా జరిగే ప్రాంతంలో ఉంటారు.
మిషన్ నుంచి వచ్చిన డబ్బు తీసుకునే చివరి క్షణంలోనే ఏటీఎంలోకి విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. ఇలా చేయడం వల్ల నగదు బయటికి వస్తుందే కానీ.. సంబంధిత ఖాతాదారుడి ఖాతాలో మాత్రం ఉపసంహరణ జరగదు. ఇలా వచ్చిన సొమ్మును ముఠా సభ్యులు, ఏటీఎం కార్డుదారులు సగం వాటాగా పంచుకుంటారని పోలీసులు గుర్తించారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు హైదరాబాద్ నుంచి విమానంలో రాజస్థాన్ బయలుదేరారని పక్కా సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు జైపుర్ విమానాశ్రయంలో వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 75 ఏటీఎం కార్డులు, రూ.2.31 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.