ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి భార్యపై వాలంటీరు కన్నేశాడు. ఇల్లు ఇప్పిస్తానని చెప్పి లోబరుచుకున్నాడు. అడ్డు చెప్పిన భర్తను హత్య చేయించాడు. గత నెల 31న ఈ హత్య జరగ్గా నిందితుడి గుట్టు బుధవారం బయటపడింది. అయితే అధికారులు 28వ తేదీనే వాలంటీరును విధుల నుంచి తొలగించినట్లు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఈ దారుణం వివరాలను పీలేరు అర్బన్ సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. పీలేరు మండలం కాకులారంపల్లె ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న సుధాకర్ (35)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే సుధాకర్ మూడున్నరేళ్ల కిందట కువైట్ వెళ్లారు.
పట్టణంలోని ఆర్టీసీ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన గ్రామ వాలంటీరు కిశోర్ (32) ఆయన భార్యకు మాయమాటలు చెప్పి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కువైట్‌లో ఉన్న భర్త సుధాకర్ మూడు నెలల కిందట ఇంటికి వచ్చారు. విషయం ఆయనకు తెలియడంతో పోలీసుస్టేషన్లో చెప్పగా వారు వాలంటీరును మందలించి పంపించారు.
దాంతో కక్ష పెంచుకుని ఎలాగైనా సుధాకర్ అడ్డు తొలగించుకోవాలని వాలంటీరు కిశోర్ పథకం రచించాడు. తిరుపతికి చెందిన ఉమా, చందు, సునీల్‌లతో కలిసి సుధాకర్ హత్యకు పన్నాగం పన్నాడు. వారి చేత సైనేడ్ సూదులు కొనుగోలు చేయించాడు. ఒక వేళ సూది వేయడం కుదరకపోతే కత్తులతో హతమార్చాలని పథకం పన్నారు. సుధాకర్ ఆగస్టు 31న కుమార్తెను పాఠశాల వద్ద దింపడానికి వెళ్లగా అనుకున్న ప్రకారం ముగ్గురు ఆయన వద్దకొచ్చి సైనేడ్ ఎక్కించిన సూదులతో గుచ్చి పరారయ్యారు.
కాసేపటికే సుధాకర్ మృతి చెందారు. తన భర్త హత్యలో వాలంటీరు కిశోర్‌పై అనుమానాలున్నాయని ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీరు హస్తం ఉందని పోలీసులు తేల్చారు. కిశోర్‌ను అరెస్టు చేయగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ వివరించారు. ఇదిలాఉండగా వాలంటీరు కిశోర్‌ను ఆగస్టు 28నే విధులనుంచి తొలగించామని అధికార వర్గాలు తెలిపాయి.