నెల క్రితం వినియోగదారులను బెంబేలెత్తించిన టమాటా ధర ప్రస్తుతం దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది జులై నెల మధ్యలో నంద్యాల జిల్లాలోని టమాటా మార్కెట్లలో గరిష్ఠంగా కిలో రూ.170 పలికింది. అలాంటిది గురువారం డోన్, ప్యాపిలి మార్కెట్లలో టమాటా ధర కిలోకు రూ.1 నుంచి రూ.3 వరకూ మాత్రమే దక్కింది.
వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసినప్పటికీ.. ఇతర ప్రాంతాల్లో టమాటాకు సరైన ధర లేకపోవడంతో ఎగుమతి నిలిపేశారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రావనే ఉద్దేశంతో రోడ్ల పక్కన పారబోశారు. ప్యాపిలి సమీపంలోని జాతీయరహదారి పక్కన ఖాళీ ప్రాంతాల్లో రాశులుగా వదిలేసి వెళ్లడంతో స్థానికులు కొందరు వాటిని సంచుల్లో ఏరుకుని వెళ్లారు. మిగిలిన పంట పశువులకు మేతగా మారింది.
వాస్తవానికి నెల క్రితం టమాటా ధరలు పెరగడంతో సామాన్యుడు వీటిని కొనేందుకు భయపడ్డారు. టమాటా పండించే రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వేడిగాలులు, భారీ వర్షాలు టమాటా పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. డిమాండ్ సప్లైకి అంతరాయం కలగడంతో వీటి రేట్లు విపరీతంగా పెరిగాయి. చెన్నైలో కిలో టమాటా ధరలు రూ. 100-130 పలికింది. బెంగళూర్ లో కిలోకి రూ.101-121 వెళ్లింది. మార్చి, ఏప్రిల్లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల టమాటాకు తెగుళ్లు సోకడంతో మార్కెట్లో అధిక దిగుబడులు రావడంతో ధరలు అప్పట్లో పెరిగాయి.
టమాటా ధర అప్పట్లో ఏ స్థాయికి వెళ్లిందంటే? కొన్ని ప్రాంతాల్లో రాత్రిళ్లు టమాటాలు చోరీలు కూడా జరిగాయి. కర్ణాటకలో హసన్ జిల్లాలో ఓ టమాటా తోట నుంచి ఏకంగా రూ.2.5 లక్షల పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. ఏపీలోనూ చాలా ప్రాంతాల్లో టమాటా తోటల్లో దొంగతనాలు జరిగాయి. కానీ.. నెల రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయ్యింది.