పింఛను పంపిణీలో ఓ మహిళా వాలంటీరు చేతివాటం ప్రదర్శించారు. వైయస్ఆర్ జిల్లా చెన్నూరు మండలం కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన నాగేష్ రెండేళ్ల కిందట సామాజిక పింఛను కోసం స్థానిక వాలంటీరు అను వద్ద దరఖాస్తు చేశారు. తొలుత మంజూరైనా నగదు చెల్లించలేదు. సమస్యను స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెండు నెలల కిందటే ఆయనకు కొత్తగా పింఛను మంజూరైంది.
తమ వల్లే పింఛను మంజూరైందని, రూ.3 వేలు చెల్లించాలని వాలంటీరు కోరారు. అంత మొత్తం ఒక్కసారిగా ఇచ్చేంత స్తోమత తనకు లేదని చెప్పడంతో నెల వారీ పింఛనులో వాలంటీరు కొంత మొత్తం తీసుకునేందుకు పింఛనుదారుతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 1న చెల్లించాల్సిన రూ.2,750 పింఛనులో రూ.వెయ్యి తగ్గించి ఇచ్చారు. దీనిపై ప్రశ్నిస్తే మళ్లీ తొలగిస్తారనే భయంతో బాధితుడు మౌనం వహించారు.
మండల వ్యాప్తంగా నూతనంగా మంజూరైన 127 పింఛన్లలోనూ ఇదే రకం వాటాల దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో సురేష్‌ను వివరణ కోరగా విచారణ చేపడతామన్నారు