స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి బి.సత్య వెంకట హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. అక్కడ ఆయనను ప్రత్యేక గదిలో ఉంచాలని స్పష్టం చేశారు.
జైలులో తగిన భద్రతను కూడా కల్పించాలని ఆదేశించారు. ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్ తెప్పించుకునేందుకు అనుమతించారు. న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించిన తర్వాత వారెంట్ కాపీ సిద్ధం చేసేందుకు కొంత సమయం పట్టడంతో చంద్రబాబు తన న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణంలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో కూర్చున్నారు. ఈ లోపు జైలుకెళ్లకుండా తప్పించుకునేందుకు చంద్రబాబు, ఆయన న్యాయవాద బృందం ఎత్తులు వేసింది.
ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్ తెప్పించుకునేందుకు ఓ పిటిషన్, జైలుకు కాకుండా ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. హౌస్‌మోషన్ రూపంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్ తెప్పించుకునేందుకు సీఐడీ న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే హౌస్ అరెస్ట్ విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఓసారి నిందితునికి రిమాండ్ విధించిన తర్వాత ఆ ఉత్తర్వులను మార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అసాధారణ, అరుదైన పరిస్థితుల్లో మాత్రమే హౌస్ అరెస్ట్ ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం ఉందని తెలిపారు. ప్రస్తుతం అలాంటి అసాధారణ, అరుదైన పరిస్థితులు ఏవీ లేవన్నారు. ఈ పిటిషన్ విషయంలో అధికారులతో సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, అందుకు తమకు ఓ రోజు గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు.
హౌస్ అరెస్ట్ ఉత్తర్వుల కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు గట్టిగా పట్టుబడ్డారు. అయితే న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో రిమాండ్‌కు సంబంధించిన వారెంట్ కాపీ సిద్ధం కావడంతో పోలీసులు ఆ కాపీని చంద్రబాబుకు చూపారు. తాము దాఖలు చేసిన హౌస్ అరెస్ట్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, అందువల్ల జైలుకు తరలించలేరని కొందరు టీడీపీ న్యాయవాదులు పోలీసులతో ఒకింత వాగ్వాదానికి దిగారు.