రోడ్డు పక్కన.. రద్దీ ప్రాంతాల్లో నడుస్తూ వెళ్తుంటే పర్సు.. దాన్నుంచి సగం బయటకొచ్చిన రూ.500 నోటు కనిపించిందా? ఇదెవరో పోగొట్టుకున్నది కాదు.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన పాంప్లెట్.
అచ్చం డబ్బులున్న పర్సులా కనిపించేలా తయారుచేసిన ఈ కరపత్రాల్ని రహదారుల వెంట.. జనం అధికంగా ఉండే మెట్రో, బస్స్టేషన్ల దగ్గర రహదారులపై జారవిడుస్తున్నారు. ఎవరైనా పొరబడి ఆ పర్సును అందుకుని చూడగానే కరపత్రం తెరుచుకుంటుంది.
సైబర్ నేరాల బారినపడితే ఆలస్యం చేయకుండా 1930 టోల్ఫ్రీకి ఫోన్ చేయాలని ఆ కరపత్రంలో ఉంటుంది. అసలు, నకిలీ మధ్య తేడా గుర్తించాలని సూచించేలా వీటిని రూపొందించారు. ఇలా దొరికిన కరపత్రాల వీడియోలను తీసి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.