రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రమాదం ఉందని, హౌస్కస్టడీ విధించాలని ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాకు గతంలో సుప్రీంకోర్టు హౌస్ అరెస్టు విధించిందని ఉదహరించారు. దాంతో ఎవరీ గౌతం నవలఖా అనే చర్చ సర్వత్రా మొదలైంది.
2017 డిసెంబరులో పుణెలో నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాపై కేసు నమోదైంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై నమోదైన కేసులో 2021 ఏప్రిల్లో ఆయన ఎన్ఐఏ ముందు లొంగిపోయారు. అనంతరం ఆయన్ను ముంబయిలోని తలోజీ సెంట్రల్ జైలుకు తరలించారు.
అతని వయసు 70 ఏళ్లుకాగా.. వయసు, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హౌస్ కస్టడీ విధించాలని నవలఖా హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు అక్కడ చుక్కెదురయింది. దాంతో సుప్రీంకోర్టు తలుపుతట్టారు. నవలఖా పిటిషన్ను సుప్రీం ధర్మాసనం విచారించింది. ఆయన వయసు, అనారోగ్యం రీత్యా ముంబయిలో హౌస్ కస్టడీలో ఉండేందుకు అనుమతించింది. ఇందుకు పలు షరతులు విధించింది.
గృహనిర్బంధంలో ఉన్నప్పుడు ముంబయి వదిలి వెళ్లరాదని సుప్రీం ధర్మాసనం గౌతం నవలఖాను ఆదేశించింది. ఇంటి వద్ద నియమించిన పోలీసు సిబ్బంది ఖర్చులను నవలఖానే భరించుకోవాలని, ఇందుకోసం డిపాజిట్ కింద రూ.2,40,000 చెల్లించాలని ఆదేశించింది. బయటివారితో మాట్లాడటం, కంప్యూటరు, ఇంటర్నెట్ వాడరాదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ లేని ఫోన్ మాత్రం రోజుకు పది నిమిషాలపాటు పోలీసుల సమక్షంలో వాడుకోవచ్చనే షరతులు విధించింది.
టీవీ, వార్తాపత్రికలకూ అనుమతిచ్చిన కోర్టు.. ఆయన ఉన్న ప్రాంతాన్ని సీసీ కెమెరాలతో పర్యవేక్షించుకోవచ్చని పోలీసులకు ఆదేశించింది. తాజాగా చంద్రబాబుకు హౌస్ కస్టడీని కోరుతున్న న్యాయవాదులు.. నవలఖా కేసును ఉదహరిస్తున్నారు.