ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ కు బానిసగా మారిన ఓ ప్రైయివేట్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఏకంగా 8.5 కోట్ల రూపాయలు కాజేశాడు. 128 మంది ఖాతాదారుల పేరిట కాజేసిన సొమ్మంతా అన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టి పోలిస్ విచారణలో తెల్ల ముఖం వేశాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఐసిఐసిఐ బ్రాంచ్లో ఈ ఘరానా మోసం జరిగింది. 2019 నుండి 2023 వరకు ఈ బ్రాంచ్ లో రూ.8 కోట్ల 65 లక్షల రూపాయలు తేడా ఉన్నట్లుగా ఉన్నతాధికారులు విచారణలో గుర్తించారు.
ఆ డబ్బు ఏమైపోయిందని తేల్చడం కోసం పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన నర్సంపేట పోలీసులు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ ఒక్కడే పథకం ప్రకారం బ్యాంకు ను మోసం చేసినట్లుగా గుర్తించారు. నాలుగేళ్ల వ్యవధిలో 128 మంది ఖాతాదారుల పేరిట బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి అన్నం పెట్టిన బ్యాంకుకు కన్నం పెట్టాడు. బ్యాంకు ని మోసం చేసి రూ 8 కోట్ల 65 లక్షలు కాజేశాడు. బ్యాంక్ ఉన్నతాధికారుల ఆడిట్ లో డబ్బు మాయం అయినట్లు బయటపడింది.
ఈ బ్రాంచ్ లో గోల్డ్ లోన్ తీసుకున్న వారు తిరిగి ఆ డబ్బు బ్యాంక్ కు చెల్లించారు. కానీ అదే బంగారం తో వెంటనే మరో లోన్ అకౌంట్ క్రియేట్ చేసేవాడు. అసలు బంగారం వారికి ఇచ్చేసి బ్యాంకు పౌచ్ లలో నకిలీ వస్తువులు పెట్టేవాడు. అలా నాలుగు ఏళ్లలో 128 మంది పేరిట బ్యాంక్ ను మోసం చేశాడు. ఈ మోసాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాదాపు నెల రోజులపాటు విచారణ జరిపి అసలు నిజాలు బయటపెట్టారు.
ఈ ఘరానా మోసగాడు కాజేసిన సొమ్మంతా ఏం చేశాడు అనే కోణంలో విచారణ జరిపారు. ఈ విచారణలో పోలీసులే నివ్వేరపోయారు. బ్యాంకును మోసం చేసి స్వాహా చేసిన సొమ్మంతా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో కరగదీశాడు. నిందితుడు బ్యాంకును మోసం చేశాడు తప్ప ఇందులో ఖాతాదారులకు ఎలాంటి నష్టం లేదని.. ఖాతాదారుల పేరిట తను పనిచేసే బ్యాంకునే మోసం చేశాడని ఖాతాదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.