మద్యానికి బానిసైన ఓ యువకుడు కన్న తల్లిపైనే పెట్రోలు పోసి తగులబెట్టిన సంఘటన అనంతపురం జిల్లా, మండల కేంద్రమైన కంబదూరులో చోటు చేసుకుంది. కంబదూరుకు చెందిన సుజాత, గోపిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లిద్దరికీ పెళ్లి చేయడంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
ఇంటర్ వరకు చదివిన కొడుకు ప్రణీత్ కొంతకాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. ఉపాధి పేరుతో నగరాలకు తిరుగుతూ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికొచ్చి వెళ్లేవాడు. కొద్దిరోజులు పనిచేసి వచ్చిన డబ్బుతో జల్సా చేసి మళ్లీ ఇంటికొచ్చి తల్లిదండ్రులను డబ్బు కోసం వేధించేవాడు. సోమవారం వినాయక చవితి సందర్భంగా ఇంట్లో తల్లి సుజాత ఉండగా మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని గొడవపడ్డాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కొంతసేపటికి పెట్రోలు తీసుకొచ్చి మంచంపై పడుకొన్న తల్లిపై పోసి నిప్పంటించి పారిపోయాడు. పొగ రావడం గమనించిన చుట్టు పక్కలవారు వెంటనే మంటలను ఆర్పివేశారు. అప్పటికే గదిలో ఆమెతోపాటు కూలర్, మంచం, సామగ్రి కాలిపోయాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎస్సై రాజేశ్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.