ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనతో వణికిపోతూనే ఉన్నారు. అయితే, శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్ అవుతుందనే చెప్పాలి.. వరుసగా చిరుతలు అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుతున్నాయి.. నడక మార్గంలో జరిగిన దుర్ఘటనలతో అలర్ట్ అయిన టీటీడీ.. ఫారెస్ట్ అధికారులతో కలిసి ఆపరేషన్ చిరుత చేపట్టారు.. చిరుత, ఇతర అడవి జంతువుల కదలికలను గుర్తించడానికి నడకమార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
చిరుత కదలికలను గుర్తించి బోన్లు ఏర్పాటు చేస్తూ వస్తుండగా.. వరుసగా చిరుతలను చిక్కుతున్నాయి.. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన ఫారెస్ట్ అధికారులు. ఈ రోజు మరో చిరుత బోనులో చిక్కింది.. దీంతో.. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులకు చిక్కిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది.. చిన్నారి లక్షితలపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే ఆరో చిరుతను ట్రాప్ చేశారు అటవీ శాఖ అధికారులు.
మరోవైపు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి.. ఈ రోజు ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇస్తూ తిరుమాడవీధుల్లో విహరించనున్నారు.
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. రెండు కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది.. నిన్న శ్రీవారిని 67,267 మంది భక్తులు దర్శించుకోగా.. 20,629 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.58 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.