వజ్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారి రైతుకు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆర్డీఓ రవీంద్ర, తహసీల్దార్ రాముకు ఫిర్యాదు చేశారు. గుంతకల్లు మండలం శంకరబండ గ్రామానికి చెందిన ఓ రైతుకు మూడు రోజుల కిందట పొలంలో వజ్రం దొరకడంతో దాన్ని కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలోని వజ్రాల వ్యాపారికి రూ.9.50 లక్షలకు విక్రయించాడు.
ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వ్యాపారి రైతు నుంచి మంచి వజ్రాన్ని తీసుకుని తక్కువ మొత్తం ఇచ్చాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. తన వజ్రానికి ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలని సంబంధిత రైతు వ్యాపారిని అడగగా.. అతడు నిరాకరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వజ్రం అంతకంటే ఎక్కువ ఖరీదు ఉండదనీ.. తన డబ్బు వాపసు ఇచ్చి వజ్రాన్ని తీసుకుపోవాలని వ్యాపారి రైతుకు తెలియజేశారని గ్రామస్థులు చెప్పారు. ఈ విషయంలో రైతును మోసగించిన వ్యాపారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్థులకు హామీ ఇచ్చారు.