ఏలూరు జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఓ పసికందు మృతదేహం పడి ఉండటంతో కలకలం రేగింది. ఆసుపత్రి ప్రాంగణంలో రద్దీగా ఉండే ప్రాంతంలో వాహనాల మధ్య పసికందు మృతదేహం పడి ఉండటం చూపరులను కలచివేసింది.
ఆసుపత్రిలో ప్రసవం అనంతరం ఆడబిడ్డ పుట్టిందని వదిలించుకున్నారా.. లేదా బయట ప్రసవం అనంతరం తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంకు సమీపంలో 108, 104 వాహనాలు నిలుపుదల చేస్తుంటారు.
వాహనాల మధ్యలో బొడ్డు ఊడని ఓ ఆడశిశువు మృతదేహాన్ని నేలపై ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శిశువు మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. ఆసుపత్రి ఆర్ఎమ్వో శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలోని మాతాశిశు కేంద్రంలో విచారణ చేయగా ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు కాదని ప్రాథమికంగా తేలింది. దీనిపై పోలీసులు లోతుగా విచారించగా మంగళవారం అర్ధరాత్రి ఓ ఆటోలో కుటుంబ సభ్యులు గర్భిణిని తీసుకొచ్చారని, ఆసుపత్రిలో చేర్చకముందే ప్రసవం జరగటంతో ఆడబిడ్డ అని అక్కడ వదిలేసి వెళ్లారని రాత్రి సమయం కావటంతో ఎవరూ పట్టించుకోలేదని తెలిసింది. అయితే శిశువు బతికి ఉండగానే వదిలేశారా, లేక చనిపోయిన తరువాత వదిలేసి వెళ్లిపోయారా అని తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.