బ్యాంక్ తప్పిదం కారణంగా ఓ కారు డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు కోటీశ్వరుడు అయ్యాడు. కానీ.. ఆ డబ్బుని ఖర్చు చేసేలోపే మళ్లీ అతని అకౌంట్ నుంచి మాయమైపోయింది. ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు నుంచి రూ.9 వేల కోట్లు తన ఖాతాలో జమైనట్లు ఉంది.
అది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు తన ఖాతా నుంచి స్నేహితుడికి రూ.21 వేలు పంపాడు. తన ఖాతాలో అంత మొత్తం ఉన్నది నిజమేనని నిర్ధారణకు వచ్చి సంతోషించేలోగా ఖాతాలో ఉన్న మిగిలిన డబ్బును తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు వెనక్కి తీసుకుంది. తూత్తుకుడిలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌కుమార్‌కు అధికారులు ఫోన్‌చేసి పొరపాటున తన ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయినట్లు తెలిపారు.
తన స్నేహితుడికి పంపిన నగదును కూడా తిరిగి చెల్లించాలని సూచించారు. చెన్నై టీనగర్‌లోని బ్యాంకు శాఖకు రాజ్‌కుమార్ తరఫున న్యాయవాదులు వెళ్లి మాట్లాడటంతో స్నేహితుడికి అతను పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం.