భూ సమస్య పరిష్కారం కోసం అభ్యర్థించిన బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా మావల మండల తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హన్మంతరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆదివారం సెలవు రోజైనా లంచం రాబట్టేందుకు కార్యాలయానికి వచ్చి బాధితుడిని పిలిపించారు. అప్పటికే వేచి ఉన్న అనిశా అధికారులు.. నిందితులు డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
అనిశా డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యతేంద్రనాథ్ యాదవ్కు మావల శివారులో సర్వే నెంబరు 181/25లో 14 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి నాలుగు పాసుపుస్తకాల్లో పొరపాట్లు ఉన్నాయి. వాటిని సరిదిద్దేందుకు ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు.
తహసీల్దార్, ఆర్ఐ పొరపాట్లను సరిదిద్ది నివేదికను కలెక్టర్కు పంపాల్సి ఉంది. ఇందుకు వారు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు అనిశాను ఆశ్రయించడంతో వలపన్ని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితులను కరీంనగర్ అనిశా కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.