టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసులు వీడటం లేదు. ఇటీవల సినీ ఫైనాన్షియర్లు, మరికొందరి అరెస్టు మరవకముందే ఆ పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. సినీ దర్శకుడు మంతెన వాసువర్మను మాదాపూర్ పోలీసులు ఈ నెల 5న అరెస్టు చేశారు. కానీ.. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదే కేసులో సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పుణేకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ అశోక్ తెలోర్ గత జూన్‌లో అరెస్టయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ముంబయికి చెందిన విక్టర్, పుణేలో ఉంటున్న రాహుల్ అశోక్ తెలోర్ పరిచయస్థులకు డ్రగ్స్ విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో రాహుల్, విక్టర్ నుంచి నార్సింగికి చెందిన పృథ్వీకృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగించేవాడు.
సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గత జూన్ 19న పృథ్వీకృష్ణ, రాహుల్‌ను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు ఇచ్చిన సమాచారంతో ‘బస్తీ’ చిత్ర దర్శక, నిర్మాత, ఓ ట్రస్ట్ ఛైర్మన్, శేరిలింగంపల్లిలో ఉంటున్న మంతెన వాసువర్మ కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. దర్యాప్తులో భాగంగా మాదాపూర్ పోలీసులు ఈ నెల 5న వాసువర్మను అరెస్టు చేశారు. వాసువర్మ, పృథ్వీకృష్ణ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసే విక్టర్ పరారీలో ఉన్నాడు. అయితే, పోలీసులు ఈ కేసును గోప్యంగా ఉంచుతుండటం చర్చనీయాంశంగా మారింది.