చిత్తూరు జిల్లాలో గ్యాంగ్‌రేప్.. కీలకంగా మారిన యువతి జుట్టు ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లి కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు
ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లి కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునికృష్ణ, పద్మావతి సోమవారం విలేకరులతో మాట్లాడారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం.. భవ్యశ్రీ ఇంటర్ విద్యార్థిని. ఈనెల 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో మృతదేహమై కనిపించింది. ఆమెను మండలానికి చెందిన ముగ్గురు యువకులు ప్రేమపేరుతో వేధించేవారు. వారే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి అనంతరం అత్యాచారం చేసి, చంపేసి, కళ్లు పీకి, జుట్టు కత్తిరించి, మృతదేహాన్ని బావిలో పడేశారు. వినాయక నిమజ్జనం కోసం 20వ తేదీన కొందరు బావి వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించింది.
ఆభరణాలను చూసి మునికృష్ణ, పద్మావతి… తమ కుమార్తెను గుర్తించారు. ఆమె అదృశ్యంపై 18నే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు సకాలంలో స్పందించి ఉంటే బతికి ఉండేదని వారు ఆరోపించారు. శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. మృతురాలి తలపై జుట్టు ఏమైందని తల్లిదండ్రులు… ఎస్సై అనిల్‌కుమార్‌ను ప్రశ్నించారు. ఆయన సోమవారం బావిలోని నీటిని మోటారు ద్వారా తోడించగా జట్టు లభించింది.
భవ్యశ్రీ మృతి విషయంలో ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు మొదలు పెట్టినట్లు ఎస్సై చెప్పారు. అనుమానితులను పిలిపించి విచారించామని, వారి ఫోన్లలో కాల్‌డేటాను పరిశీలించామని అనుమానాస్పదంగా ఏమీ లేదని చెప్పారు. మృతదేహం నుంచి నమూనాలను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.