బువ్వ పెట్టలేకున్నా.. బిడ్డల్ని తీసుకెళ్లండి తల్లిదండ్రులు బాధ్యత మరచి పిల్లలను వదిలేసి జాడలేకుండా పోయారు. తల్లి మమకారంలో తండ్రి వాత్సల్యంతో పెరగాల్సిన వారికి అన్నీ అమ్మమ్మే అయ్యింది.
తల్లిదండ్రులు బాధ్యత మరచి పిల్లలను వదిలేసి జాడలేకుండా పోయారు. తల్లి మమకారంలో తండ్రి వాత్సల్యంతో పెరగాల్సిన వారికి అన్నీ అమ్మమ్మే అయ్యింది. కూలికిపోయి వచ్చే నాలుగు రూకలతోనే ఇద్దరు పిల్లల కడుపు నింపుతూ వచ్చింది. ఆరేళ్లు గడిచాయి. వృద్ధాప్యంతో వారికి నాలుగు మెతుకులు కూడా పెట్టలేనని.. చదువు సంధ్యలు చెప్పించలేనని భావించి పోలీసులను ఆశ్రయించింది.
వారి భవిష్యత్తు బాగుండాలని కన్నీటిని కొంగుచాటున దాచి భారమైన హృదయంతో ఇద్దరిని పోలీసుల సహకారంతో సంక్షేమ అధికారులకు అప్పగించింది. ఈ సంఘటన సంతోష్‌నగర్ ఠాణా పరిధిలో జరిగింది. పాతనగరం బండ్లగూడ, రక్షాపురానికి చెందిన 7, 8 ఏళ్ల ఇద్దరు బాలికలను అమ్మమ్మ బొర్రాలు యాదమ్మ సోమవారం లక్డీకాపూల్‌లోని జిల్లా సంక్షేమ అధికారులకు అప్పగించారు.
ఆమె మాట్లాడుతూ వారిని ఏదో ఒక గూటికి చేరిస్తే అన్నం దొరుకుతుందని.. చదువు నేర్చుకుంటారని ఇలా చేశానని.. ఇందుకు సహకరించిన సంతోష్‌నగర్ సీఐ శివచంద్ర, మహిళా ఎస్సై నస్రీన్ బేగంకు ధన్యవాదాలు తెలిపారు.