అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి ఆధునిక వైద్య చికిత్స అందించటానికి బదులుగా ఉక్కు సంకెళ్లు వేయటంతో మృతిచెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చేజర్లకు చెందిన ఓర్సు వినోద్(28) అనే యువకుడు దేవాదాయశాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇదే సందర్భంలో కూలీ పనులకు కూడా వెళుతున్నారు.
ఇటీవల అనారోగ్యానికి గురికావటంతో వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ప్రమాదం ఏమీలేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వారు సూచించారు. అయినా ఒంట్లో నలత తగ్గకపోవటంతో మానసికంగా ఆందోళనకు గురైన వినోద్ రాత్రి వేళల్లో కేకలు వేసేవారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఒక ప్రార్థనా మందిరం వద్దకు తీసుకెళ్లారు. స్వస్థత చేకూరాలంటే కొన్నిరోజులు ఇక్కడ బందీగా ఉండాలని అక్కడి నిర్వాహకులు సూచించారు.
ప్రార్థనా మందిరం వద్ద ఉన్న మానసిక చికిత్స కేంద్రం నిర్వాహకులకు రూ. అయిదు వేలు చెల్లించి వినోద్‌ని అక్కడే వదిలి వచ్చారు. వినోద్‌ను చూసేందుకు వెళ్లిన మేనమామ, బంధువులతో తనకు బాగా ఉందని, సంకెళ్లు విప్పి ఇంటికి తీసుకెళ్లాలని కోరారు. చికిత్స కోసం వచ్చి బందీగా మారటంతో వినోద్ ఆందోళనకు గురయ్యారు. ఇలాగే ఇంకొన్ని రోజులు ఉంటే ఆరోగ్యం మరింత మెరుగవుతుందన్న ఆశతో మేనమామ చేజర్లకు తిరిగి వచ్చారు. ఇదే సందర్భంలో తెల్లవారుజామున వినోద్ మృతిచెందారంటూ ప్రార్థనా మందిరం నుంచి సమాచారంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.
దేవాదాయశాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న వినోద్ తండ్రి పక్షవాతంతో 20 సంవత్సరాలుగా మంచం పట్టారు. వినోద్‌కి రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. ఏడాది వయసు ఉన్న బాబు ఉన్నారు. తల్లి కూలీ పనులకు వెళ్లి కుటుంబ పోషణ చేస్తున్నారు.