కన్న తల్లి కనిపించకుండా పోతే ఎవరైనా వెతుకుతారు. కానీ ఆ కొడుకు మాత్రం అలా చేయలేదు. ఇక ఆయన భార్య ఇంటి గుట్టు బయటకు రాకుండా కాపాడేందుకు విఫలయత్నం చేసింది. అయితే నేరం దాగుతుందా..? ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం రావటంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ శవాన్ని చూసి నివ్వెరపోయారు.
ఈ అమానుష ఘటన ఏలూరులో జరిగింది. కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తు పట్టలేనంతగా ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఇంటిపై పోర్షన్లో వృద్ధురాలి మృతదేహం ఉన్నా అదే ఇంట్లో కింది పోర్షన్లో ఉంటున్న తన కోడలు మాత్రం విషయం తనకేం తెలియదని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్న కొడుకే కన్న తల్లిని చంపి విషయం బయటకు రాకూడదనే భయంతో సుమారు 3 నెలలుగా ఆమె మృతదేహాన్ని ఇంటిపై పోర్షన్లో ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
తంగేళ్ళమూడి యాదవ నగర్లో బసవ దుర్గా ప్రసాద్.. భార్య లలిత, తల్లి నాగమణితో కలిసి నివసిస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య లలిత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది. అయితే వారు నివసిస్తున్న ఇంటి నుండి గత కొంత కాలంగా దుర్వాసన వస్తుంది. దీంతో చుట్టుపక్కల వారు దుర్గాప్రసాద్, లలితను దుర్వాసన ఏమిటని ప్రశ్నించగా పిల్లి చనిపోయిందంటూ కథలు చెబుతూ వచ్చారు.
కానీ ఎంతకీ దుర్వాసన తగ్గకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్వాసన వస్తున్న ఇంటిపై పోర్షన్కి వెళ్లి తలుపులు ఓపెన్ చేసి చూడగా అక్కడ కుళ్ళిపోయిన స్థితిలో పురుగులు పట్టి వృద్ధురాలి మృతదేహం వారికి కనిపించింది. దాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె చనిపోయి సుమారు మూడు నెలలు అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శరణార్థ నాగమణిగా పోలీసులు గుర్తించారు.