చిన్న వేరుశెనగ పలుకు చివరికి ప్రాణాల మీదకు తెచ్చిందంటే నమ్ముతారా? కొండాపూర్‌కు చెందిన విజయలక్మికి వేయించిన వేరుశెనగ పలుకులు రోజూ తినడం అలవాటు. ఒక పక్కకు ఒరిగి తినడంతో ఒక పలుకు పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుంది.
రానురాను దగ్గు, జ్వరం, ఆయాసం తదితర లక్షణాలు కన్పించాయి. వైద్యులు న్యూమోనియాగా భావించి మందులు ఇచ్చారు. అయినా పెరుగుతుండటంతో నానక్‌రాంగూడలోని స్టార్ ఆసుపత్రిలోని ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ కిషన్‌ను సంప్రదించింది.
ఆమెకు సీటీ స్కాన్ చేసి శ్వాసనాళాలు, ఊపిరితిత్తులకు మధ్య ఏదో ఇరుక్కుని న్యూమోనియాకు దారి తీసినట్లు తేల్చారు. వెంటనే బ్రాంకోస్కోపీతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న దాన్ని బయటకు తీసి చూడగా అది వేరుశనగ పలుకు కావడంతో ఆశ్చర్యపోయారు.