కాశం నుంచి పడిన పిడుగుశక్తిలో అద్భుతాలు చేయవచ్చంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు నగర సీసీఎస్ డీసీపీ కె.శిల్పవల్లి బుధవారం తెలిపారు. రైస్‌పుల్లింగ్ (రాగిచెంబు) పేరుతో రూ.కోట్లు కొట్టేసేందుకు ముఠా పెద్ద ఎత్తే వేసినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఎన్.విజయ్‌కుమార్, ఆర్.సాయిభరద్వాజ్ అలియాస్ బంటి, ఎం.సంతోష్, యు.సురేందర్ ఓ పబ్‌లో కలిశారు. అక్కడి నుంచి నలుగురు మిత్రులుగా మారారు. పెద్దఎత్తున డబ్బు సంపాదించేందుకు ఎత్తువేశారు. ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్ సూచనతో రైస్‌పుల్లింగ్ పేరిట మోసాలు ప్రారంభించారు.
వ్యాపారులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ పథకం అమలు చేయసాగారు. ఆకాశం నుంచి భూమ్మీద పిడుగు పడినపుడు తయారైన శకలాలు తమ వద్ద ఉన్నాయంటారు. శాటిలైట్లు, ఆణుఆయుధాలు తయారుచేసేంతటి శక్తి దానిలో దాగుందంటూ మాటలతో మభ్యపెడతారు. నాసా, ఇస్రో వంటి పరిశోధన సంస్థలు రూ.కోట్లు వెచ్చించి కొనేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ఆశ చూపుతారు.
అంతటి అతీంద్రశక్తులున్న పరికరం తమ వద్ద ఉందని, సొంతం చేసుకునేందుకు రూ.5 కోట్లు కావాలంటారు. ఆ తరువాత రూ.3 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమవుతారు. అందినంత కాజేస్తారు. అలా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన వ్యాపారి కిరణ్‌ను మోసగించారు. మూడు దఫాలుగా రూ.2.85 కోట్లు పోగొట్టుకున్నాడు. చివరకు మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.