అక్రమంగా నగరంలోకి చేరిన పాకిస్థానీ యువకుడు ఏడాదిపాటు గుట్టుగా ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులకు సమాచారం చేరటంతో అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. డబ్బుపై ఆశతో పాకిస్థాన్ అల్లుడిని ఆహ్వానించిన మామే పోలీసులకు పట్టిచ్చినట్టు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. పాక్ యువకుడు ఫయాజ్ మహ్మద్(24) ఉపాధి కోసం షార్జా చేరాడు. అక్కడ దుస్తుల తయారీకేంద్రంలో పనిచేసే హైదరాబాద్ యువతి నేహాఫాతిమాతో మొదలైన స్నేహం పెళ్లికి దారితీసింది. గతేడాది ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నగరం చేరింది. ఇక్కడికి వచ్చాక కుమారుడు పుట్టాడు. షార్జాలోని అల్లుడి వద్ద పెద్దఎత్తున సొమ్ము ఉంటుందని భావించిన మామ జుబేష్ షేక్ సరికొత్త ఎత్తు వేశాడు.
భారత్ వీసాకు ఎక్కువ సమయం పడుతుందని అల్లుడికి నేపాల్ వీసా తీసుకున్నాడు. నవంబరులో అత్తమామలు జుబేష్, అఫ్జల్‌బేగం, భార్య నేహాఫాతిమా అక్కడకు చేరి ఫయాజ్ను కలిశారు. నలుగురూ కలసి నేపాల్-యూపీ సోనాలీ సరిహద్దు వద్ద గస్తీ సిబ్బందికి రూ.5,000 ఇచ్చి రైలులో హైదరాబాద్ చేరారు.
రూ.5వేలతో జనన ధ్రువపత్రం.. పాక్ అల్లుడిని హైదరాబాద్ పౌరుడిగా మార్చేందుకు మామ మార్గాలు అన్వేషించాడు. ఆధార్‌కార్డు వచ్చేంతవరకు అతడిని ఇల్లు కదలకుండా చేశారు. ఈ ఏడాది మార్చిలో ఫయాజ్ బామ్మర్ధి మహ్మద్ గౌస్ పేరుతో ఓ మీసేవ కేంద్రం ద్వారా రూ.5వేలు ఇచ్చి జీహెచ్ఎంసీ నుంచి జనన ధ్రువపత్రం పొందారు.
ఆధార్‌కార్డు పొందేందుకు మాదాపూర్ కేంద్రానికి ఫయాజ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అల్లుడి తెచ్చిన రూ.4-5లక్షలు ఖర్చవటంతో మామ దుర్బుద్ది బయటపడింది. ఎలాగైనా అతడిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చాడు. దీంతో ఈనెల 1న దక్షిణమండలం పోలీసులు ముందుగా పాకిస్థాన్ యువకుడిని, అనంతరం అత్తమామలను అరెస్ట్ చేశారు.