కర్నాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదం నేపథ్యంలో శుక్రవారం కర్నాటక బంద్కు పిలుపునిచ్చాయి కన్నడ ప్రజా సంఘాలు. తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కర్నాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కాగా, ఈ బంద్కు బీజేపీ, జేడీఎస్, ఆప్ మద్ధతు ప్రకటించాయి.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కావేరి జల వివాదం కొనసాగుతోంది. కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కర్నాటక నుంచి 15 రోజులపాటు తమిళనాడుకు 5000 క్యూసెక్ నీటిని విడుదల చేయాలని కోరింది. కావేరీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదైనందున నీటిని విడుదల చేసే స్థితిలో లేమని కర్నాటక రైతులు చెబుతున్నారు..దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల జగడం రాజుకుంది.
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు కర్నాటక రాష్ట్ర బంద్ పాటిస్తున్నాయి. అనేక సంఘాలు కలిసి కన్నడ ఒక్కుట పేరుతో ఏకమై ఈ బంద్కు పిలుపునిచ్చాయి. బెంగళూరులో టౌన్ హాల్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. యావత్తు కర్నాటక ప్రయోజనాల కోసం తాము బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని హైవేలు, టోల్ గేట్లు, రైల్వేలు, విమానాశ్రయాలను మూసివేయిస్తామని తెలిపాయి. ఈ బంద్కు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లతోపాటు హోటళ్లు, ఆటోరిక్షాల సంఘాలు మద్దతు పలికాయి.