ఆ ఇద్దరూ మూగవారు. ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. కులం వేరైనా పెళ్లిచేసుకున్నారు. వారి ప్రేమను ఆ గ్రామం నిరాకరించింది. ఊరి నుంచి వెలివేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా నాయకనహట్టి ఠాణా పరిధిలోని ఎన్ దేవరహళ్లిలో ఆందోళన కలిగించింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరహళ్లికి చెందిన సావిత్రమ్మ రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మణికంఠ అనే యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇద్దరూ పుట్టుకతోనే మూగవారు. ఇద్దరూ 2021లో బెంగళూరులోని ఓ ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తున్న సమయంలో కలిశారు.
అప్పట్లోనే ఆమె మణికంఠను గ్రామానికి తీసుకెళ్లగా, గ్రామప్రజలు అభ్యంతరం చెప్పారు. కులాంతర వివాహం కూడదని రూ.30 వేల జరిమానా విధించారట. పెద్దలు కోపంగా ఉన్నారని వారిద్దరూ మళ్లీ బెంగళూరు వెళ్లిపోయి ఉపాధి పొందారు. ఆమె గర్భందాల్చి, ఇటీవలే పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. సావిత్రమ్మ తిరిగివచ్చిన విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు బుధవారం పంచాయితీ పెట్టి గట్టిగా హెచ్చరించారు.
ఆ ఇద్దరూ సాయంత్రం సమీప పట్టణం చెళ్లకెరె చేరుకుని అక్కడి బధిరుల పాఠశాలలో తలదాచుకున్నారు. అక్కడి ఉద్యోగులు వారి పరిస్థితిని మహిళా సంరక్షణ కేంద్రంలో వివరించి, తహసీల్దార్ రెహాన్ పాషాకు ఫిర్యాదుచేశారు. ఆయన స్పందించి చిత్రదుర్గలోని స్వాధార (సంరక్షణ) కేంద్రానికి తరలించి, ఆశ్రయం కల్పించారు. దేవరహళ్లి గ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించి, చర్యలు తీసుకుంటామని వివరించారు.