ఎట్టకేలకు భారత వీసా పొందిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెప్టెంబర్ 27న హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు ఘనస్వాగతం లభించింది. కెప్టెన్ బాబర్ అజామ్, జట్టులోని ఇతర ఆటగాళ్లందరూ ఈ స్వాగతంతో చాలా సంతోషంగా కనిపించారు. పలువురు పాక్ ఆటగాళ్లు ఈ స్వాగతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అక్టోబర్ 5 నుంచి భారత్ గడ్డపై వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. అంతకంటే ముందు పాకిస్థాన్ జట్టు 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో ఉన్న పాక్ జట్టు పూర్తి ఫుడ్ మెనూను వెల్లడించింది. ఇందులో చికెన్, మటన్ నుంచి గ్రిల్డ్ ఫిష్ వరకు అన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల ఆహారంలో ప్రోటీన్ ఉంచడం, గ్రిల్డ్ లాంబ్ చాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్‌లను చేర్చారు. అంతేకాకుండా ప్రోటీన్ల కోసం చికెన్, మటన్, చేపలు అడిగారట. ఇదేకాకుండా.. కార్బోహైడ్రేట్ల కోసం ఉడికించిన బాస్మతి బియ్యం, స్పఘెట్టి బోలోగ్నీస్ సాస్, వెజిటేరియన్ పులావ్ వండమని చెఫ్ కు చెప్పారు. పాకిస్థానీలు దాదాపు 2 వారాల పాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు. ఈ సమయంలో వారు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బిర్యానీని రుచి చూసే అవకాశం కూడా ఉండనుంది.
మరోవైపు భారత్‌కు వచ్చిన తర్వాత పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం లేదు. ప్రపంచకప్‌లో అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో పాకిస్థాన్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.