వారిద్దరూ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే.. యువతి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం చేయబోతున్నారని యువకుడికి తెలిపింది.
నువ్వు వచ్చి తీసుకుపోవాలని అతనికి చెప్పింది. నేను ఇప్పుడు రాలేనని నా తమ్ముడిని పంపిస్తున్నానని అతనితో రావాలని తెలిపాడు ఆ ప్రేమికుడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. విధి ఆడిన వింత నాటకంలో తన అన్న ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి చెందిన ఘటన బోగోలు మండలం కోవూరుపల్లి ఆకాశవంతెన వద్ద చోటుచేసుకుంది.
బిట్రగుంట ఎస్సై శేఖర్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరి గ్రామానికి చెందిన కాకార్ల నాదముని అలియాస్ నిరంజన్, రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన ఓ యువతి ఏడాది కిందట ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. అనంతరం ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం చేయబోతున్నారని నిరంజన్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో తన తమ్ముడైన కాకర్ల దేవేంద్రను పంపిస్తున్నానని.. అతనితో వచ్చేయమని చెప్పారు. నంబర్ ప్లేట్ లేని స్కూటీలో యువతిని తీసుకొని కాకర్ల దేవేంద్ర స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద జాతీయ రహదారి ఆకాశవంతెన సమీపంలో నిద్రమత్తులో ఉన్న అతను డివైడర్‌ను ఢీకొన్నాడు.
ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి 108కు సమాచారమిచ్చారు. వాహనంలో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. యువతి చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.