ఉత్తర్ప్రదేశ్లో ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందనే కారణంతో కుటుంబసభ్యులే ఆమెకు నిప్పంటించి దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాపుడ్ జిల్లాకు చెందిన ఓ యువతి (23) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది.
ఇద్దరి మధ్య చనువు పెరిగి ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం యువతి కుటుంబానికి తెలియడంతో ఆమెపై విరుచుకుపడ్డారు. బంధువులకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ యువతిని తల్లి, సోదరుడు ఇంటికి సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు రక్షించి, ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. శరీరం 70 శాతానికి పైగా కాలడంతో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఆమె తల్లి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.