ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి జువైనల్ కస్టడీకి తరలిస్తున్న బాలుడు పరారయ్యాడు. ఈ సంఘటన ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రమేష్ అనే వ్యక్తిపై గత గురువారం బాలుడు బ్లేడుతో దాడిచేశాడు. దీంతో నిందితుడైన బాలుణ్ని కానిస్టేబుళ్లు పి.శ్రీనివాసులు, బాబురావు ఒంగోలు జువైనల్ కోర్టుకు తీసుకెళ్లారు.
న్యాయమూర్తి బాలుడికి 4 రోజులు జ్యుడీషియల్ కస్టడికి అప్పగిస్తూ తిరుపతి జువైనల్ హోమ్‌కు తరలించాలని ఆదేశించారు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు అతణ్ని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌కు రాత్రి 7.30 గంటలకు తీసుకొచ్చారు. మూత్రశాలకు వెళ్లాలని బాలుడు అడగ్గా.. అక్కడికి తీసుకువెళ్లారు.
ఆ సమయంలో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసులు బస్టాండు పరిసరాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై వారు ఒంగోలు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ రఫీద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.