నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షల్ని ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు.. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎర వేశారు. తపాలా, ప్రఖ్యాత వైద్యశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల్లో వసూలు చేశారు. అధికార పార్టీ నేతల స్టిక్కర్లు ఉన్న వాహనాల్లో రావడం, ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లుగా ఏమార్చి.. భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు.
నెలలు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ పోలీసులు విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఒంగోలు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన మరో వ్యక్తి కలిసి కొంతకాలం కిందట.. తమకు అధికార పార్టీలో కీలక వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు, కాకులపాడు, ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతాలకు చెందిన పలువురు నిరుద్యోగులు.. వీరి మాటలు నమ్మారు.
ఒక్కొక్కరు రూ.అయిదు లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ముట్టజెప్పారు. దీంతో కొందరికి నేరుగా తపాలా శాఖలోనూ, మరికొందరికి గుంటూరు సమీపంలోని ప్రఖ్యాత వైద్యశాలల్లో ఉద్యోగాలు ఖాయమంటూ అవతలి వ్యక్తులు నమ్మించారు. డబ్బులను బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయించుకున్నారు. ఎంతకాలమైనా ఉద్యోగాలు రాకపోవడం, సరిగా స్పందన లేకపోవడంతో బొమ్ములూరుకు చెందిన ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తీగ లాగితే.. వీరి డొంక కదిలినట్లు తెలుస్తోంది. వీరిని నమ్మి మోసపోయిన నిరుద్యోగులు ప్రస్తుతం కొందరే ఉన్నా, ఈ విషయం బహిర్గతమైతే పెద్ద సంఖ్యలో బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నూజివీడుకు చెందిన ఓ యువకుడు తన ఉద్యోగం కోసం రూ.12 లక్షలు ఇవ్వడంతో పాటు, మరో ఇద్దరితో రూ.అయిదేసి లక్షలు చొప్పున కట్టించడంతో చిక్కుల్లో పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కీలక నిందితులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యలో దళారుల్ని నియమించుకుని, వసూళ్ల దందా కొనసాగించినట్లుగా తెలుస్తోంది.