ఆమె ఎంబీఏ చదువుతోంది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ప్రాణాలు తీసుకునేలా చేసింది. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఎం.పవన్ వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ లాస్ట్ బస్టాప్ ప్రాంతంలో ఉండే కరీంశెట్టి జన్ని, సత్యవతి దంపతుల కుమార్తె యువనాగదుర్గ ఎంబీఏ చదువుతోంది.
తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. స్థానికంగా ఉండే పెయింటర్‌తో పెళ్లి నిశ్చయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేశారు. కొన్నినెలల తర్వాత పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. గత నెల 29న తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆమె, సోదరుడు ఉన్నారు. సోదరుడు భోజనం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లగా నాగదుర్గ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. పెళ్లి ఇష్టం లేనందునే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.