ఎన్ఎస్జీ కమాండోనంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను సంప్రదించిన ఓ మోసగాడు ఇల్లు అద్దెకు కావాలంటూ రూ.2.41 లక్షలు కొట్టేశాడు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్(31) తన ఇంటిని అద్దెకివ్వాలని మ్యాజిక్ బ్రిక్ మొబైల్ యాప్‌లో ఇంటి వివరాలు, ఫోన్ నంబరు నమోదు చేశాడు.
సెప్టెంబరు 19న ఆశిష్ కుమార్ పహారీ పేరుతో ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఎన్ఎస్జీ కమాండోనంటూ పరిచయం చేసుకున్నాడు. తాను దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అవుతున్నానని, ఇల్లు అద్దెకు కావాలని కోరాడు. ఆధార్, ఎన్ఎస్జీ గుర్తింపు, ఇతర కార్డులు పంపించాడు. ఆ తర్వాత ఆర్మీలో అకౌంటింగ్ అధికారినంటూ కెప్టెన్ రాజేంద్రసింగ్ షెకావత్ పేరుతో మరో వ్యక్తి ఫోన్ చేశాడు. ఆశిష్‌కుమార్ మీ ఇంట్లోకి అద్దెకు వస్తున్నాడని ఆర్మీ నిబంధనల ప్రకారం రెండు నెలల అడ్వాన్సు ఇవ్వాలంటే.. ఇంటి యజమాని ముందుగా తమకు డబ్బు పంపించాలని చెప్పాడు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి రెట్టింపు తిరిగి మీకు బదిలీ అవుతుందన్నాడు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ తొలుత రూ.5 పంపాడు. ఆ తర్వాత రెండు నెలల అడ్వాన్సు మొత్తం రూ.46 వేలు గూగుల్ పే నుంచి పంపాడు.
నిర్ణీత మొత్తం కంటే రూ.5 ఎక్కువ పంపినందున ఈ సొమ్ము తిరిగి పంపే ప్రక్రియ ఆగిపోయిందని, రూ.45,995 మళ్లీ పంపిస్తే మొత్తం డబ్బు బదిలీ చేస్తామని చెప్పాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెండోసారి డబ్బు పంపాడు. ఇది కూడా అందలేదని రూ.50 వేలు పంపాలని కోరగా అదే చేశాడు. తప్పుడు లావాదేవీల వల్ల ఆర్మీ ఖాతా స్తంభించి పోయిందని రూ.50 వేలు, రూ.49,995 చొప్పున రెండుసార్లు బదిలీ చేయాలని సూచించాడు. అలా రూ.2,41,995 పంపాడు. అయినా పదేపదే డబ్బు అడగడంతో బాధితుడు మోసమని గ్రహించి పోలీసులకి ఫిర్యాదు చేశాడు.