వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలనుకున్నారు. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో రెండు రోజుల క్రితం ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి ఉరి వేసుకొని ప్రియురాలు తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహా ఎనిమిది నెలలుగా గోపన్‌పల్లి జర్నలిస్ట్ కాలనీలోని హాస్టల్లో ఉంటుంది. నానక్‌రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్లోని బేకరీలో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగంలో చేరింది. బాలాపూర్ ఠాణా పరిధిలోని వెంకటాపురంలో ఉంటున్న సల్మాన్ ఆరు నెలల క్రితం ఇదే బేకరీలో చేరాడు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
విషయం తెలియడంతో బేకరీ నిర్వాహకులు సల్మాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. సల్మాన్ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను అక్టోబర్ 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడు చనిపోయిన విషయం రెండు రోజుల తర్వాత తెలియడంతో నేహా తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది.
ఇద్దరు రూమ్మేట్స్ డ్యూటీకి వెళ్లగానే గడియ పెట్టుకొని నేహా బయటకు రాలేదు. ఆమె గదిని శుభ్రం చేసేందుకు హాస్టల్ సిబ్బంది వెళ్లి ఎంత పిలిచినా ఆమె స్పందించలేదు. కిటికీలోంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. హస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే నేహా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. ప్రియుడి ఆత్మహత్యను జీర్ణించుకోలేక తనువు చాలించిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.