ELURU | వ్యాపారి అప్పు ఎగ్గొట్టేందుకు లో కన్నింగ్ ప్లాన్.. కానీ దొరికిపోయారిలా
ELURU | స్థిరాస్తి వ్యాపారిని పిస్టళ్లతో బెదిరించిన సుపారీ గ్యాంగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు టూటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ చంద్రశేఖరరావు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన దాట్ల బలవెంకట సత్యనారాయణరాజు గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి అన్నే కాంతారావు వద్ద 2017-19 సంవత్సరాల మధ్య రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకు వినయ్‌రెడ్డి మధ్యవర్తిత్వం నడిపారు.
సత్యనారాయణరాజుకు పెదవేగి మండలం మొండూరులో 41 ఎకరాల ఆయిల్‌పామ్ తోట ఉంది. ఈయన కొంతకాలంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉంటున్నారు. అప్పు గురించి మాట్లాడేందుకు కాంతారావు సత్యనారాయణరాజు, వినయ్రెడ్డిలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిప్టు చేసేవారు కాదు. వారిని ఎలాగైనా పట్టుకోవాలని కాంతారావు యత్నిస్తుండగా.. గత నెల 19న బెంగళూరులోని సీబీఐ కోర్టుకు సత్యనారాయణరాజు, వినయ్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అప్పు చెల్లించాలని, లేకుంటే మొండూరులోని పొలాన్ని తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేశారు.
అప్పు ఎగ్గొట్టాలని సత్యనారాయణరాజు భావించారు. ఈ క్రమంలో కాంతారావును బెదిరించాలని హైదరాబాద్‌కు చెందిన సరిపల్లి శివభాస్కర్ అలియాస్ శర్మ ద్వారా నాగరాజు అలియాస్ రఘువర్మను కలిసి సుపారీ మాట్లాడుకున్నారు. ముందుగా రూ.2.50 లక్షలిచ్చారు. నాగరాజు స్వగ్రామం పోడూరు మండలం కొమ్ముచిక్కాల. ఇతను పాతనేరస్థుడు. కాంతారావును బెదిరించి బాకీ వదులుకునేలా చేయాలనేది ఒప్పందం. అనుకున్న విధంగా అప్పు చెల్లిస్తామని.. ఏలూరులోని ఎన్ స్వ్కేర్ హోటల్‌కు రావాలని వినయ్‌రెడ్డి ఫోన్ చేయడంతో కాంతారావు గత నెల 27న వచ్చారు.
రిసీవ్ చేసుకున్న సత్యనారాయణరాజు, వినయ్‌రెడ్డి హోటల్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి మాట్లాడుతుండగా.. నాగరాజు గ్యాంగ్‌ను వెంటబెట్టుకుని ఆ గదిలోకి వచ్చాడు. సత్యనారాయణరాజు, వినయ్‌రెడ్డి గదిలో నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం నాగరాజు గ్యాంగ్ కాంతారావును బెదిరించి చిత్రహింసలకు గురిచేసింది. కారులో ఎక్కించుకొని జంగారెడ్డిగూడెం వైపు తీసుకెళ్లి పిస్టళ్లతో బెదిరించి చంపేస్తామన్నారు. అప్పు వదిలేయాలని.. లేకుంటే చస్తావంటూ బెదిరించారు.
కాంతారావు వారి షరతులకు అంగీకరించడంతో విడిచిపెట్టారు. అనంతరం ఆయన స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ప్రధాన నిందితులు సత్యనారాయణరాజు, వినయ్‌రెడ్డి కారులో వెళ్తున్నారని తెలుసుకుని గురువారం ఒంగూరు బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.