WIFE వెళ్లిపోయిందనే కోపంలో తమ్ముడిని ప్లాన్ చేసి చంపిన అన్న
WIFEను వేధించాడని కత్తితో తమ్ముడి మెడ కోసి దారుణంగా హతమార్చాడు ఓ అన్న. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం… ఫిలింనగర్ బసవతారకనగర్‌లో నివసించే సజ్జి అహ్మద్, షబ్బీర్ అహ్మద్ అన్నదమ్ములు. వృత్తిరీత్యా వెల్డర్స్ అయిన వీరు కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యారు.
సజ్జి అహ్మద్ భార్య ఐదేళ్ల క్రితం తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. షబ్బీర్ అహ్మద్ భార్య సైతం ఏడాది క్రితం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అతడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు కాగా, ఓ కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. పిల్లలు తల్లుల వద్దే ఉంటున్నారు. షబ్బీర్ అహ్మద్ భార్యను గతంలో సజ్జి అహ్మద్ తరచూ వేధింపులకు గురిచేసేవాడు.
షబ్బీర్ అహ్మద్, సజ్జి అహ్మద్‌ల పుట్టిన రోజు ఈనెల 4న బుధవారమే. ఇద్దరి మధ్య రెండేళ్ల తేడా ఉన్నా పుట్టింది మాత్రం ఒకే రోజు. ఇదే రోజు తమ్ముడు సబ్జి అహ్మద్‌ను హతమార్చాలని షబ్బీర్ అహ్మద్ పథకం రచించాడు. బుధవారం మద్యం, కత్తిని తెచ్చి ఇంట్లో దాచాడు. అనుకున్న ప్రకారం రాత్రి తమ్ముడితో కలిసి బాగా మద్యం తాగిన షబ్బీర్ అహ్మద్ మరోసారి గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కత్తితో దాడి చేసి సజ్జి అహ్మద్ మెడ కోశాడు. తీవ్ర రక్తస్రావమైన సజ్జి ప్రాణాలు వదిలాడు. హత్యను చూసిన తండ్రి వృద్ధాప్యం కారణంగా అడ్డుకోలేక కన్న కొడుకు కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే తల్లడిల్లిపోయాడు.
షబ్బీర్ అహ్మద్ తమ్ముడ్ని హతమార్చిన అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి తాను హత్య చేసినట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఫిలింనగర్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. షబ్బీర్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ ఎంజీఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై సతీష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు