JOB SCAM | చాపాడు మండలం చియ్యపాడుకు చెందిన సూర్యనారాయణ రెడ్డి ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని పలువురికి మోసం చేశాడని పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని బిందుమాధవి ఆరోపించారు. సోమవారం ఆమె చియ్యపాడులోని సూర్యనారాయణరెడ్డి ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేశారు. తనకు చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదని తనకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు.
హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో తనకు సూర్యనారాయణ రెడ్డి పరిచయం అయ్యాడని తన తమ్ముడికి ఉద్యోగం కావాలని ఆశ్రయించగా రూ.5.30 లక్షలు ఇచ్చానన్నారు. ఇలా చాలామంది వద్ద తీసుకున్నాడని ఆరోపించారు. పెద్ద మనుషులతో పంచాయితీలో ఈ నెల 9న కొంత మొత్తం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించానన్నారు.
పోలీసులు ఆమెను పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై చాపాడు ఎస్.ఐ. మైనుద్దీన్ను వివరణ కోరగా జరిగిన ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.