KRISHNA DISTRICT | ఓ యువకుడు తనను వేధిస్తున్నాడని పది రోజుల క్రితమే ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఫలితంగానే నాగాయలంకలో ఓ మహిళ నిండుప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా నాగాయలంక ప్రధాన రహదారిలో ఉన్న అల్పాహార హోటల్లో పని చేస్తున్న యతిరాజుల దుర్గ అనే వివాహితపై ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఓ యువకుడు కత్తితో డొక్కలో పొడిచి పరారయ్యాడు. దుర్గ భర్త ప్రకాష్, కుటుంబ సభ్యులు ఆమెను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.
బాధితురాలి భర్త ప్రకాష్ మాట్లాడుతూ అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన రేపల్లె హేమంత్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా తన భార్య వెంట పడుతూ వేధిస్తున్నాడు. దీనిపై నాగాయలంక పోలీస్ స్టేషన్లో పది రోజుల క్రితం ఫిర్యాదు చేయగా పోలీసులు హేమంత్‌ను పిలిచి మందలించి వదిలేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి దుర్గ హోటల్లో పని చేస్తున్న సమయంలో హేమంత్ హఠాత్తుగా వెనుకవైపు గోడ దూకి వచ్చి కత్తితో పొడిచి పారిపోయాడని చెప్పారు. ఈ సంఘటనపై నాగాయలంక ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.