SHAMSHABAD AIRPORT | ఎయిర్ఇండియా విమాన సర్వీసును హైజాక్ చేస్తున్నట్లు వచ్చిన మెయిల్ కలకలం రేపింది. ప్రయాణికుల్లో ఐఎస్ఐ ఇన్ఫార్మర్ ఉన్నాడని, పేరు, పాస్‌పోర్ట్ వివరాలతో సహా సందేశం రావడంతో విమానాశ్రయంలో భద్రతాధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు.
ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఆకస్మికంగా నిలిపి నాలుగు గంటల పాటు తనిఖీ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, వచ్చింది నకిలీ మెయిల్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎయిర్పోర్ట్ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ఇండియా ఏఐ-951 విమాన సర్వీస్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 111 మంది ప్రయాణికులతో దుబాయ్ వెళ్లేందుకు ఆదివారం రాత్రి 8 గంటలకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్తున్న బాదినేని తిరుపతి (జగిత్యాల), లోలం వినోద్‌కుమార్ (నిర్మల్), రాగి రాకేశ్‌కుమార్ (నిజామాబాద్) ఆ విమానంలో ఉన్నారు. ఈ సమయంలో విమానాశ్రయ అధికారులకు ఒక మెయిల్ అందింది. విమానంలో ప్రయాణిస్తున్న బాదినేని తిరుపతి ఐఎస్ఐ ఇన్ఫార్మర్ అని, దుబాయ్ విమానాన్ని హైజాక్ చేయడానికి పథకం వేశాడని ఆ సందేశంలో ఉంది. పాస్‌పోర్టు నంబరుతో సహా వివరాలున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని రన్‌వే నుంచి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు.
విమానం ఒక్కసారిగా రన్‌వే నుంచి నిర్జన ప్రదేశం వైపు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు బాంబు నిర్వీర్యదళంతో దాదాపు నాలుగు గంటలకుపైగా తనిఖీ చేశారు. మెయిల్లోని వివరాల ఆధారంగా తిరుపతితో పాటు వినోద్‌కుమార్, రాకేశ్కుమార్లను భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. కానీ.. విమానాశ్రయ అధికారులకు పంపిన మెయిల్ నకిలీదని తేల్చారు. ఆ ముగ్గురు కేవలం ఉపాధి కోసమే దుబాయ్ వెళుతున్నట్లు గుర్తించారు.