TELANGANA NEWS | HYDERABADలో ప్రేమించానంటూ వెంటపడి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నాళ్లు యువతితో సహజీవనం చేసి ఆమె గర్భం దాల్చాక మోసం చేసిన యువకుడిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ పి.వి.రామప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. బల్కంపేటకు చెందిన ఓ యువతి కంప్యూటర్ కోర్సు చేయడానికి 2022లో ఎస్సార్‌నగర్‌లోని ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది.
ఆ సంస్థ యజమాని గుంటూరు జిల్లా వెందుర్తి మండలం సిరిగిపాడుకు చెందిన అందుగుల చినబాబు ఆ యువతికి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని కొన్నాళ్లు వెంటపడ్డాడు. ఇద్దరు కలిసి కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఏప్రిల్‌లో ఆ యువతి గర్భం దాల్చింది. చినబాబు అతని వ్యాపార భాగస్వామి అంజిరెడ్డి సాయంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. ఒత్తిడితో గర్భస్రావం చేయించుకుంది.
ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని కోరగా చినబాబు నిరాకరించాడు. నిందితుడు మరో యువతితో కలిసి వనస్థలిపురంలో ఉన్నట్లు తెలుసుకొని బాధితురాలు అక్కడికి వెళ్లి నిలదీసింది. ఆమెను గెంటేయడంతో చేసేది లేక ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.