YSR DISTRICT | ముందు వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగడం, దానిని తప్పించుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కన్నుమూశారు. వైయస్ఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. చింతకొమ్మదిన్నె మండలంలోని ఆజాద్నగర్కు చెందిన సయ్యద్ మహబూబ్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం 14 మంది ప్రొద్దుటూరు నుంచి మల్లేల దర్గాకు ఆటోలో బయలుదేరారు.
ఎర్రగుంట్ల శివారులోని ప్రొద్దుటూరు రోడ్డులో ఓ మండపం వద్దకు వచ్చేసరికి వారి ఆటో ముందు వెళ్తున్న టిప్పర్ హఠాత్తుగా బ్రేక్ వేసింది. దానిని ఢీకొట్టకుండా తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆటో బలంగా ఢీకొంది. దీంతో అందులో ఉన్న సయ్యద్ మహబూబ్ బాషా , ఆయన భార్య సయ్యద్ హసీన , వారి బంధువు షేక్ షాకీర్, ఆటోను నడుపుతున్న అమీన అక్కడికక్కడే కన్నుమూశారు. గాయాల పాలైన 10 మందిని చికిత్స నిమిత్తం కర్నూలు, కడప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.