GUNTUR | ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ బాలికను మోసగించి గర్భవతిని చేసిన దోషికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు… పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ నాగూర్వలి అనే 20 ఏళ్ల యువకుడు తన ఇంటి సమీపంలో ఉంటున్న బంధువుల 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు.
అనంతరం బాలిక గర్భం పోవడానికి మందులు ఇవ్వడంతో అనారోగ్యం పాలైంది. విషయం తెలుసుకున్న నాగూర్వలి కుటుంబ సభ్యులు వారిద్దరి వివాహం చేయడానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పెద్ద మనుషులు జోక్యం చేసుకున్నారు. ఇదిలా ఉండగా జులై 24, 2017లో బాలిక ఇంట్లో ఎవరూ లేరని గమనించిన నాగూర్వలి ఆమె అంగీకారం లేకుండా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో పిడుగురాళ్ల పొలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు.
ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయడంతో దోషికి పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు తీర్పు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.4 లక్షలు నష్టపరిహారాన్ని చెల్లించాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.