HYDERABAD | ఏటీఎం ద్వారా డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఓ అగంతకుడు మూడ్రోజుల్లో రెండు సార్లు మోసం చేసి కుచ్చుటోపీ పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట, బాలంరాయి సమీపంలోని అన్నానగర్‌కు చెందిన బి.శ్రీకాంత్ ఎస్సార్‌నగర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.
ఈ నెల 7న సంస్థకు చెందిన రూ.3 లక్షల నగదును ఎస్సార్‌నగర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా జమ చేసేందుకు వచ్చాడు. సర్వర్ నెమ్మదిగా ఉండటంతో ఏటీఎం పని చేయలేదు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు పక్కనే ఉన్న ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. అతనిని నమ్మిన శ్రీకాంత్ రూ.3లక్షలు ఇవ్వగా.. కొద్దిసేపటికే డబ్బు డిపాజిట్ అయినట్టు ఓ నకిలీ సందేశాన్ని సంస్థ యజమానురాలికి పంపించాడు.
ఈ నెల 9న శ్రీకాంత్ మరో రూ.3 లక్షలు తీసుకుని ఏటీఎం వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న అదే అగంతకుడికి డబ్బిచ్చాడు. డబ్బు ఖాతాకు బదిలీ చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఈసారి ఎటువంటి సందేశం రాకపోడంతో అకౌంట్‌ని పరిశీలించగా ఫేక్ అని తేలింది. మొత్తంగా కేటుగాడు రెండు రోజుల్లోనే రూ.6 లక్షలు కొట్టేశాడు.