FACEBOOK | సోషల్ మీడియాలో అప్పటి వరకు ఆప్యాయంగా పలకరించుకునే గ్రూప్‌లో ఉన్నట్లుండి ఏదో ఒక పోస్టు అంతరాన్ని సృష్టిస్తోంది. ఆత్మీయులుగా ఉన్న వారిని శత్రువుగా మార్చేస్తుంది. కొత్త పరిచయాలు అటుంచితే, బాల్యమిత్రులు, బంధువులు సైతం పోస్టుల ప్రభావంతో దూరమవుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.
చేతిలో ఫోన్ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో చిన్న వ్యాఖ్య చేశారా?. ఎవరో పెట్టిన పోస్టు మీకు నచ్చలేదన్న కారణంతో కాస్త కఠినంగా వ్యతిరేకించారా? పోలీసు కేసుల్లో ఇరుక్కునట్లే. ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టిన వారిపైన కేసులు పెడుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు పోస్టుల కింద కామెంట్లు పెడుతున్న వారిపై నిఘా ఉంచనున్నారు. ఐటీ చట్టంతో పాటు ఐపీసీ కింద కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు, పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకునే వారు, విద్యార్థులు, యువత.. ఇటువంటి వాటిలో ఇరుక్కుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ సమయంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడితే నమోదయ్యే కేసులకు, ఎన్నికల సమయంలో నమోదయ్యే కేసులకు చాలా తేడా ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. కాబట్టి ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జాగ్రత్తగా ఉండండి.